కుమారి 21 F బ్యాడ్ సినిమా కాదు.. అదో రకం!

0

కుమారి..21..F

నిన్న సినిమా చూసినప్పటి నుండి సుకుమార్ మీద గౌరవం రెట్టింపైంది. విచిత్రమైన హంగులు, ఆర్భాటాలతో దారి తప్పి, హీరోల చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా కి ఊపిరి పోస్తూ ఒక నిలకడమైన కథామ్శమున్న దారిలో నడిపిన చిత్రం కుమారి!

kumari-21f-review

సాధారణంగా మన చుట్టూ ఎన్నో ప్రేమ కథలు జరుగుతుంటాయి. ఎన్నో వినే ఉంటాము. ప్రేమించిన వాళ్ళ కోసం చంపడానికి అయినా, చనిపోవడానికి అయినా సిద్ధం అనిపించేంత స్ట్రాంగ్ పాయింట్ ని ఎంచుకున్న సుకుమార్ ఎక్కడా ఫ్లో మిస్ అవ్వకుండా చాలా బోల్డ్ గా చిత్రాన్ని తీసారు. అలా అని ఇందులో చంపడాలు, చనిపోవడాలు ఉండవు. అపార్ధాలు, అనుమానాలు మాత్రం బోలెడుంటాయి. కాని చివరికి నెగ్గేది మాత్రం ప్రేమే. తను ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా కుమారి(కన్య) ఏనా కాదా అనే అనుమానం ద్వారా పడే సంఘర్షణ ను అనుసరించి అల్లుకున్న కథ కుమారి 21 F. మనతో పాటు జీవితాన్ని పంచుకొనే జీవిత భాగస్వామి మీద మనకు ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ రోజుల్లో ఎంతో మంది ఆ ఆశల తో పాటు అనుమానాలని కూడా పెంచుకుంటున్నారు. ఇదే విషయం పై సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు మంచి పదునే పెట్టారు సుకుమార్. కానీ అసలే 1 నేనొక్కడినే సినిమా ఫ్లోప్ తో కొంత బాధ ఉన్న, ప్రేక్షకులకు నిత్యం వైవిధ్యాన్ని అందించాలనే తపన ఉంది కాబట్టి ఎలా అయినా ఇలాంటి కథాంశం తో చిత్రాన్ని తెరకెక్కించాలి అని సంకల్పించుకుని ఆయన అసిస్టెంట్ తో దర్సకత్వం చేయించాలని నిర్ణయించుకుని తను నిర్మాత గా మారారు. ఈ సందర్భంగా నా స్నేహితుడు సంవత్సరం క్రితం పెట్టిన ఒక ఫేస్బుక్ స్టేటస్ గురించి నాకు చెప్పాడు. బహుశా ఈ చిత్రం తో ట్రావెల్ చేస్తున్నప్పటి తన భావాలను ఇలా వ్యక్త పరిచిన సుకుమార్, తను అనుకున్న దాన్ని వెలిబుచ్చడం లో ఏ మాత్రం తప్పు చేయలేదు.

20151121025511

ఇటువంటి బోల్డ్ కథాంశం తీసుకున్నప్పుడు దానిని బోల్డ్ గా చెప్తే నే తనలో ని రచయితను సంతృప్తి పరుచుకునట్టు అవుతుంది. సుకుమార్ ఈ విషయం లో ఏ మాత్రం రాజీ పడినట్టు అనిపించలేదు. తొలి చూపు లో నే సిద్ధూ (రాజ్ తరుణ్) ని చూసి ప్రేమించేస్తుంది కుమారి. ఎంతగా అంటే, సిద్ధూ కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం అయిపోతుంది. సిద్ధూ తో కలిసి తాగుతుంది, తిరుగుతుంది, అడక్కుండానే ముద్దులిచ్చేస్తుంటుంది. ఇంకా సిద్దు కోసం ఎంత దూరం అయిన వెళ్లేందుకు సైతం సిద్ధం అవుతుంది. ఏ అబ్బాయి కి అయినా ఒక అమ్మాయి నుండి ఇంతకన్నా ఇంకేం ప్రేమ కోరుకుంటాడు. కాని సిద్ధూ కి ప్రేమ ను అంగీకరించాలా లేదా అనే సందిగ్దత. ప్రేమ పెదాల వరకు వస్తుంది కానీ పెదవి దాటి మాటల రూపం దాల్చుకొని “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని మాత్రం బయటకు రాదు. ఈ సమయం లో ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో అనుమానాలు. దీనికి తోడు చుట్టూ ఉండే స్నేహితులు కుమారి పై వెదజల్లే పుకార్లు. మనిషి విన్న దాని కంటే చూసినదే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు/నమ్ముతాడు. ఇలా స్నేహితుల ద్వారా ఎన్ని విన్నా ఎప్పుడూ పూర్తిగా నమ్మని సిద్ధూ ఒక రోజు తన ముందే వేరే వాళ్ళతో తిరుగుతున్న కుమారి ని చూస్తాడు. తాను విన్నదంతా నిజమే అనే ముగింపు కు వచ్చేస్తాడు. ఆ సమయం లోనే

“నన్ను ప్రేమించే మెచ్యురిటీ (పరిపక్వత) నీకు లేదు” అంటుంది కుమారి.

దిక్కు తోచని స్థితి సిద్ధూ ది. రియాలిటీ కి దగ్గర గా ఉన్న ఈ కథాంశాన్ని చిత్ర ప్రథమార్థం లో ఎంత బాగా చూపించారంటే, ఆ కథ ను, ఆ పాత్రలను మనం జీర్నించుకొనే సమయాన్ని మనకు ఇవ్వడానికి బాగా బోల్డ్ అవుతుందేమో అనే సందేహం వచ్చినా ప్రేక్షకులు తెలివైన వాళ్ళు, వాళ్ళు అర్ధం చేస్కోగలరు అని తమను సమాధాన పరుచుకుంటూ సుకుమార్చి మరియు దర్శకుడు ఇంకా అతని బృందం చిత్రాన్ని మలిచిన తీరు అభినందనీయం. అయితే 1 నేనొక్కడినే చూసిన చాలా మంది “మొదటి భాగం అర్ధం చేస్కొడానికి కొంత సమయం ఇచ్చి ఉండాలి, ప్రేక్షకులకు అంతా హడావుడి గా కనిపించింది కథాంశం” అని విమర్శించారు. ఈ విమర్శకు నోచ్చుకున్నట్టున్నారు సుకుమార్. అందుకే, చిత్రం లో కథానాయక పాత్ర లోని లోతు ను అర్ధం అయ్యేందుకు కావాల్సిన దాని కంటే ఎక్కువ సమయాన్నే ఇచ్చారు ప్రేక్షకులకి. అయినప్పటికీ, రొటీన్ సినిమాల మధ్య వచ్చే ఈ సు’కుమార్’ చిత్రాన్ని చూడడానికి మనల్ని మనం ముందుగా నే ట్యూన్ చేసుకొని ఉండాల్సింది. ఆ పరిపక్వత మనకి ఉండాల్సింది!

“తనని ప్రేమిస్తున్నాను అంటుంది కానీ వేరే వారితో నో కనిపిస్తుంది. తనే కావాలంటుంది కానీ తన వేషధారణ, నడవడిక లో ఏదో తేడా దొర్లుతుంది.” ఇలాంటి అనుమానాల కుంపటి లో జీవనం సాగిస్తుంటాడు సిద్ధూ. తను ప్రేమించే వ్యక్తి కళ్ళ ముందే వేరొకరితో ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఎలా ఉంటుందో కుమారి కి కూడా అర్ధం అయ్యేలా చేద్దాం అని ఒక ప్లాన్ వేస్తాడు సిద్ధూ. అయితే పాపం ఆ ప్రయత్నం కూడా విఫలం కావడం తో మళ్ళి కుమారి ని ఎలా మార్చాలి/దక్కించుకోవాలి అనే ఆలోచనల సంఘర్షణ లో కూరుకుపోతాడు. ఇప్పుడెం చేయాలో తెలిదు, కానీ ఆ అమ్మాయిని కోల్పోనేందుకు మనసు ఒప్పుకోవడం లేదు. దార్లన్నీ ముసుకు పోయాయి! ఈ దశ లో కథలో కుమారి అంటున్న మెచ్యురిటీ ని సిద్ధూ అర్ధం చేసుకోవడం చాలా కీలకం. మాములుగా ఉంటె అది సుకుమార్ సినిమా ఎందుకు అవుతుంది. అది “సుకుమార్ రైటింగ్” ఎలా అవుతుంది. అందుకే ఆ మెచ్యురిటీ ని అర్ధం అయేలా చెప్పేందుకు సిద్ధూ తల్లి తండ్రుల కథకు ఒక అబ్బురపరిచే ట్విస్ట్ ను జోడించి కంక్లూడ్ చేస్తాడు సుకుమార్. ఆ సిచ్యుఎషణ్ లో ఆటోమేటిక్ గా తను చేస్తున్న తప్పు తెల్సుకుంటాడు సిద్ధు. కాని అప్పటికే సమయం మించి పోతుంది. సాధారణంగా ఎవరు సాహసించని ఒక క్లైమాక్స్ ను సుకుమార్ రాసుకున్నారు. దాన్ని కూడా ఒక బోల్డ్ క్లైమాక్స్ గా అభివర్ణించవచ్చు. కాని ఎంత వరకు మనం రిసీవ్ చేసుకోగలం అన్న అంశాన్ని మన మేచ్యురిటీ కే వదిలేసాడు సుకుమార్. అనుమానాన్ని పటా పంచలు చేస్తూ సాదించిన పరిపక్వత తో మనసులో అనురాగాన్ని నింపుకొని కుమారి దగ్గరకు వెళ్ళిన సిద్ధు కళ్ళ ముందు జరిగిన అనర్ధాన్ని యాక్సెప్ట్ చేస్తాడు! కుమారి కోరుకున్న పరిపక్వత ను మించిన పరిపక్వత ఇది.! ఇలా సినిమా ని ముగించి సుకుమార్ నిజంగా పెద్ద సాహసమే చేసాడు.

సాధారణంగా ఈ సినిమా అంత అయ్యాక మొదట తిట్టుకొనే వాల్లే ఎక్కువ ఉంటారు. మనం సాదారణంగా మాట్లాడుకున్నదే సినిమా లో ఎవరైనా చుపించేస్తే మనం తట్టుకోలేము, రేగ్రేస్సివ్ అంటాము. మెచ్యురిటీ తో అలోచించి దాన్ని తెర పై అవిష్కరిమ్పజేస్తే దాన్ని ప్రోత్సహించి ప్రశంసించే పరిపక్వత కు ఇంకా తెలుగు సినిమా ఎదగలేదేమో అనిపిస్తుంది. కానీ అదే సినిమా ని తమిళ్, హిందీ లో తీసాక మాత్రం ఎవరు చెప్పకుండా నే భలే మెచ్యురిటీ వచ్చేస్తుంది మనకి. ఎంతైనా తెలుగు సినీ ప్రేక్షకులం! సుకుమార్ అనుకున్నది అనుకున్నట్టుగా నే సూర్య ప్రతాప్ తెర పై ఆవిష్కరించాడు. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రచయిత గా సుకుమార్ చేసిన సాహసోపేతమైన గొప్ప ప్రయత్నం కుమారి 21 F. ఫస్ట్ హాఫ్ లో ఎంత బోల్డ్ గా చిత్రాన్ని చూపించినా ఆఖరికి మనం సెకండ్ హాఫ్ లో మరీ ముఖ్యం గా చివరి అర్ధ గంట లో జరిగిన సినిమా గురించే మాట్లాడుకుంటాము. మనకు అది నిజంగా బోల్డ్ అనిపించదు. నిజమే కదా, ఇందుకోసమే అంత బోల్డ్ గా చిత్రాన్ని మలిచారు అనిపిస్తుంది. అందుకే ఇది సుకుమార్ సినిమా అయింది లేకుంటే ఏం అయ్యేదో ప్రత్యేకించి చెప్పే అక్కర లేదు. రాజ్ తరుణ్, హేభ పటేల్ ఇద్దారు చాలా చక్కగా నటించారు. ఎక్కడ ఓవర్ చేస్తున్నట్టు అనిపించదు, నటన లో ఇద్దరు మంచి పరిపక్వత ని ప్రదర్శించారు. రత్నవేలు చాయాగ్రహణం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ఆకర్షణలు. నటులందరు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

చివరి గా ఈ చిత్రం లో బాగా నచ్చిన అంశం, ప్రీ క్లైమాక్స్ లో కుమారి సిద్ధు కు రాసే లేఖ! ప్రతి అంశాన్ని చాలా విడమర్చిన తీరు అబ్బుర పరుస్తుంది. పరిస్థితుల ప్రభావం వలన కొన్ని కొన్ని సంఘటనల్లో చిక్కుకోవాల్సి వస్తుంది కాని మనం చుసేదంతా నిజమే అయి ఉంటుంది అన్న గారెంటీ లేదు అనే విషయాన్నీ స్పష్టంగా రెండు మాటల్లో భలేగా చెప్పారు.

నువ్వు నమ్మేదే నిజం , నువ్వు నమ్మనిదంతా అబద్ధం .. అదే జీవితం!

“చూసిన చాలా మందికి ఈ కుమారి 21 F నచ్చకపోవచ్చు, ఇది బ్యాడ్ సినిమా అని కూడా అనొచ్చు. కానీ బ్యాడ్ అంటే అన్ని బ్యాడ్ సినిమాల లాగా కాదు, అదో రకం.”

– – – రాయరావ్ శ్రీరామ్NO COMMENTS

LEAVE A REPLY