కృష్ణారావు సూపర్ మార్కెట్ రివ్యూ … “నవరసాలు దొరికే కృష్ణా రావు సూపర్ మార్కెట్”

0

కృష్ణారావు సూపర్ మార్కెట్ రివ్యూ … “నవరసాలు దొరికే కృష్ణా రావు సూపర్ మార్కెట్

తొలి పలుకులు:

ప్రతీవారం ఎన్నో తెలుగు సినిమాలు. ఎందరో కొత్త దర్శకులు. కొత్త నటులు. కొత్త టెక్నీషియన్స్. వాళ్ళ భవిష్యత్తు ని థియేటర్ లో అందరి ముందు వుంచితే, ఎంతమందిని ప్రేక్షక దేవుళ్ళు గుర్తు పెట్టుకుంటున్నారు? ఎందరిని సినిమా తల్లి అక్కున చేర్చుకుంటోంది?

అలాగే బోలెడన్ని ఆశలతో, ఈ వారం రిలీస్ అయిన కొత్త సినిమా “కృష్ణారావు సూపర్ మార్కెట్” . ప్రతీవారం ఇంటికి కావల్సిన సరుకులు తెచ్చుకోడానికి, దాదాపు అందరరూ సూపర్ మార్కెట్ కి వెళ్తారు కదా! మరి ఈ వారం ఈ “కృష్ణారావు సూపర్ మార్కెట్” కి ఎంతమంది వెళ్ళారు? వాళ్ళకి కావల్సిన నవరసాలు అక్కడ దొరికాయా?

కథ గురించి.:

ఈ సినిమా కృష్ణా రావు సూపర్ మార్కెట్ చుట్టూ నడిచే కథ. సినిమాలో నడిచే ప్రతీ పాత్రకి ఈ మార్కెట్ తో లింక్ వుంటుంది. ప్రేమ, రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్ , మంచి స్క్రీన్ ప్లే , మంచి మాటలు, ఎడిటింగ్ , కెమెరా వర్క్ అన్నీ చక్కగా కుదిరాయి.

దర్శకుడి గురించి:

ప్రేమ కథలు. హారర్ కథలు. థ్రిల్లర్ కథలు. సస్పెన్స్ కథలు. ఇలా ఏదో ఒక జోనర్ తో మనల్ని పలకరించిన సినిమా లు చాలానే వున్నాయి. ప్రేమకథకి సస్పెన్స్ మిళితం చేసి, సినిమా చూసే ప్రేక్షకుడికి, ఎక్కడా థ్రిల్ మిస్ కానివ్వకుండా, సీట్ కి కట్టిపడేసే, స్క్రీన్ ప్లే ని రాసుకున్నాడు దర్శకుడు. ఇక్కడే కొత్త దర్శకుని ప్రతిభ మనకి బాగా కనిపిస్తుంది. తను రాసుకున్న స్క్రీన్ ప్లే ని మరింత స్పష్టం గా, తనకి అందుబాటు లో వున్న బడ్జెట్ లో, ప్రేక్షకుని కి ఆసక్తికరం గా చూపించడంలో దర్శకుడు శ్రీనాథ్ పులకురం మంచి మార్క్స్ నే కొట్టేసాడు. ఇతనికి మంచి భవిష్యత్తు వుంది అని తను ఈ సినిమా తీసిన విధానం తో తెలుస్తుంది. .

నటీ నటులు గురించి:

ఒక మంచి కథకి, మంచి నటులు కావాలి. అప్పుడే ఆ సినిమా బాగా వస్తుంది. అందరినీ అలరిస్తుంది. సీనియర్ హాస్య నటులు గౌతమ్ రాజు తను నిర్మిస్తూ , సినిమా లో ఒక మంచి పాత్ర లో నటిస్తూ , తన కొడుకు కృష ని హీరో గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చాడు. టైటిల్ రోల్ ని పోషించిన భరణి , డిటెక్టివ్ పాత్ర లో రవి ప్రకాష్ , పోలీసు ఆఫీసర్ గా బెనర్జీ , కానిస్టేబుల్ గా గౌతం రాజు, అమ్మ పాత్ర లో సన, తమ పాత్రలకు సరిపడా అభినయం కనిపించారు. ఇంతమంది సీనియర్ నటులు, అందరూ కలిసి స్క్రీన్ కి నిండుతనం తీసుకొచ్చారు.

హీరో కృష్ణ డాన్స్ లు , ఫైట్ లతో నటన లో కొత్తవాడు అని ఎక్కడా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక అమ్మాయి వెంటపడే పాత్ర లో లవర్ బాయ్ గా కనిపిస్తాడు. కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసే కుర్రాడి పాత్ర లో మంచి ఫిట్నెస్ బాడి తో కనిపిస్తాడు. పాటల్లో అద్బుతం గా డాన్స్ చేసాడు. ఫైట్ సీన్ల లో తన లో మంచి ప్రతిభ కనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ రాసుకున్న సీరియస్ స్క్రీన్ ప్లే కి, తన అభినయం తో పూర్తిగా న్యాయం చేసాడు.

బెంగాల్ అమ్మాయి ఎల్సా చాలా చక్కగా చేసింది. డాన్స్ లు బాగా చేసింది. తెలుగు సినిమా లో హీరోయిన్ కి కథ ని మలుపు తిప్పే కీలక పాత్ర లభించడం ఒకింత అదృష్టమే.

కృష్ణా రావు సూపర్ మార్కెట్ లో కనిపించే నటులు , హీరో ఫ్రెండ్స్ గా చేసిన వాళ్ళు ,మిగతా పర్వాలేదు అనిపించారు.

సైకో కిల్లర్ గా చేసిన అతను సినిమా మొత్తం మాస్క్ లో వున్నా కూడా , చివరి లో మంచి నటన కనబరిచాడు. మొత్తం గా ఈ సినిమా కొత్త పాత నటుల మంచి కలయిక అని చెప్పాలి .

సంగీతం ఎలా వుంది? :

ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుడు ని సీట్ లో కూర్చో పెట్టాలి అంటే అందుకు తగ్గ నేపధ్య సంగీతం కావాలి. మంచి నేపధ్య సంగీతం తో పాటు, అలరించే పాటలు ఇందులో వున్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ మంచి ప్లస్ .

మిగతా టెక్నీషియన్స్ ?

ఒక మంచి కెమెరా వర్క్ కూడా ఈ సూపర్ మార్కెట్ లో కనిపిస్తుంది. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారి ఎడిటింగ్ ప్రతిభ తో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మరింత ఆకట్టుకుంటుంది. మిగతా అందరి టెక్నీషియన్స్ దగ్గర తనకి కావాల్సింది దర్శకుడు బాగానే తెప్పించుకున్నాడు.

ఎక్కడ తప్పింది?

జనరల్ గా సస్పెన్స్ జోనర్ లో, ప్రేమ కథ అంటే, ప్రేక్షకుడికి కొంచెం ఇబ్బందే. అక్కడ ఈ కథ కొంచెం తడబడింది. మెయిన్ లీడ్ ప్రేమ కథ ఇంకా కొంచెం క్లారిటి గా రాసుకొని వుంటే బాగుండేది. కృష్ణా రావు సూపర్ మార్కెట్ లో జరిగే మరో ప్రేమ కథ కి క్లియర్ ఎండింగ్ లేదు అనిపిస్తుంది . వీన్నిటినీ దర్శకుడు తన స్క్రీన్ ప్లే తో కొంచెం దిద్దుపాటు చేసాడు. బడ్జెట్ పరిమితులు సినిమా మేకింగ్ లో అక్కడ అక్కడ కనిపించాయి.

చివరి మాట:

ఫస్ట్ హాఫ్ లో మంచి ప్రేమ కథ. మధ్య మధ్య లో సైకో కిల్లర్ హడావుడి. ఇంటర్వల్ లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్. ఇక ప్రేక్షకుడు ఎక్కడా ఊహించలేని కథనం తో సెకండ్ హాఫ్ మొత్తం ప్రేక్షకుడ్ని సీట్ కి అతుక్కొనేలా చేస్తుంది.

మొత్తం గా మంచి కథ, కథనం, మాటలు ,సంగీతం తో పాటు, ప్రేక్షకుడికి సస్పెన్స్ ఎక్కడా మిస్ చెయ్యని , తెలివైన టేకింగ్ అండ్ డైరక్షన్ మనకి ఈ సినిమా లో కనిపిస్తుంది.

ఈ వారం కృష్ణా రావు సూపర్ మార్కెట్ కి వచ్చిన ప్రేక్షకుడు, తను పెట్టే డబ్బు కి , బోలెడంత సస్పెన్స్ , థ్రిల్ ని తమ వెంట తీసుకొని వెళ్లొచ్చు.

ఈ వారం నవరసాలు దొరికే మార్కెట్ ” కృష్ణా రావు సూపర్ మార్కెట్ ” !!!
***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here